తిరువణ్ణామలైగా పిలిచే అరుణాచలంలో శ్రీరమణులు పలుచోట్ల, పెద్దగుడిలోను, గిరి గుహలలోను నివాసముంటూ చివరగా గిరి దక్షిణపాదంలో స్థిరపడగా అదే నేటి శ్రీరమణాశ్రమంగా రూపుదిద్దుకొంది. వారు సన్న్యాసాది దీక్షలు తీసుకోలేదు. ఎవరికీ ఇచ్చి శిష్యులుగా చేసుకోనూ లేదు. 1896 సెప్టెంబర్ 1న అరుణాచల ఆగమనం నాటినుంచి ఏప్రిల్ 14, 1950లో మహానిర్వాణం వరకు – సుమారు 54 సం.లపాటు వారికి అత్యంత ప్రియమైన అరుణగిరి పొలిమేర దాటిపోలేదు.
ఊళ్ళోకి వచ్చిన కొత్తలో బ్రాహ్మణస్వామిగా పిలువబడే కాలంలో వారి తొలి స్థావరం పెద్ద ఆలయమే. వేయిస్తంభాల మంటపంలో కొద్ది వారాలుండి, తుంటరి మూకల దాడులను తప్పించుకొనేందుకు అక్కడే భూగృహంగా వున్న పాతాళలింగం గుహకు చేరుకున్నారు. సూర్యరశ్మి చొరరాని ఈ గుహలో రోజుల తరబడి గాఢసమాధిలో వుండగా క్రిమికీటకాలు వారి తొడలను గాయపరిచేవి. అయితే, అల్లరిమూక ఈ స్థావరాన్ని కనిపెట్టి ఇబ్బందిని కొనసాగించారు. ఆ కాలంలోనే శేషాద్రిస్వామిగా పిలువబడే ఓ మహాత్ములు బ్రాహ్మణస్వామి మహిమనెరిగి వారి రక్షణ బాధ్యత వహిస్తుండేవారు. ఓనాడిలాగే తుంటరిదండు దాడిచేయగా, వారిని తరిమివేసి, ఇతరుల సాయంతో వొళ్ళెరగని బ్రాహ్మణస్వామిని పక్కనే వున్న సుబ్రహ్మణ్య స్వామి సన్నిధికి తెచ్చారు. పరవశంలో వున్న స్వామికేమీ తెలియదు. అక్కడివారు బలవంతంగా వారిచేత తినిపించేవారు. స్వామి తమకు తెలియకనే అక్కడి తోటలలోను, రథాల కింద కూచుండి పోయేవారు.

Patala Lingam
తరువాత, వారు గుడికి కొంతదూరంలో వున్న మామిడితోపులోకి మకాం మార్చారు. ఇక్కడ స్వామిని వారి పినతండ్రి (బాబాయి) నెల్లియప్ప అయ్యర్ కనుగొని, ఇంటికి తీసుకొని పోవుటకు ప్రయత్నించగా స్వామి స్పందించలేదు. గత్యంతరం లేని బాబాయి నిరాశగా మానామదురైకి వెళ్ళి, ఈ సమాచారాన్ని తల్లి అళగమ్మకు నివేదించారు. అమ్మకీ వార్త ఎడారిలో సరోవరమే అయింది.
పెద్దకొడుకు నాగస్వామిని తీసుకొని అళగమ్మ తిరువణ్ణామలై వచ్చింది. స్వామి అపుడు పెద్దగుడి పక్కనే వున్న గిరిశిఖరం పవలకున్రు (ప్రవాళగిరి) పై శివాలయంలో ఉన్నారు. కన్నీళ్ళతో కొడుకును అర్థించింది, ఇంటికి పోదామని. గిరిసమంగా ఉన్న స్వామిని ఎవరు కదిలించగలరు? అమ్మ ఆరాటాన్ని చూచిన అక్కడివారు స్వామిని ఆమెకు సమాధాన మీయమని కాగితం, పెన్సిల్ ఇవ్వగా వారిట్లా రాసారు.
“కర్త వారివారి ప్రారబ్ధానుసారము జీవుల నాడించును. జరుగనిది ఎవరెంత ప్రయత్నించినను జరుగదు; జరుగునది ఎవరెంత యడ్డుపెట్టినను జరుగనే జరుగును. ఇది సత్యము. కనుక మౌనముగ నుండుటయే ఉత్తమము.”
బరువెక్కిన గుండెతో తల్లి వెనుతిరిగింది. ఈ సంఘటన తర్వాత, రమణులు గిరిపైనే పలుతావులలో రమించారు. వాటిలోకెల్లా విరూపాక్షగుహలో సుదీర్ఘంగా 17 సం.లున్నారు. తొలినాళ్ళలో స్వామి చాలావరకు మౌనంగా ఉండేవారు. అప్పటికే వారిచుట్టూ జిజ్ఞాసువుల, సేవక భక్తుల బృందం ఏర్పడింది – పిల్లలు, పెద్దలు కడకు జంతువులతో సహా. హృదయ మధురమైన దృశ్యం ఏమంటే, ఊళ్ళోని చిన్నవాళ్ళు సైతం శ్రమకోర్చి కొండెక్కి విరూపాక్షగుహవద్ద వున్న స్వామిని చేరి, కొంత తడవు వారివద్ద కూచొని, సరదాగా ఆడుకొని, తాయిలాలను ఆనందాన్ని పంచుకొని, తిరిగి వెళ్ళేవారు. వారికి స్వామి తమలో ఒకరు.

Nagasundaram, Alagammal, and Sri Ramana
ఉడుతలు, కోతులు వచ్చి వారి చేతినుంచి ఆహారాన్ని స్వీకరించేవి. ఇలాటి అద్భుత దృశ్యాలెన్నో, ఎన్నెన్నో.
మానామదురైలో మరిది వద్ద వుంటున్న తల్లి అళగమ్మ స్వామికోసం చాలాసార్లు వచ్చివెళ్ళారు. ఓసారి ఆమె టైఫాయిడ్ వంటి జ్వరంతో చాలారోజులు బాధపడ్డారు. అంతా దైవేచ్ఛ అని ఉపదేశించిన స్వామి ఈసారి ఆమెకెంతో ఉపచరించి, ఆమె స్వస్థత కొరకు అరుణాచలేశ్వరునికి ఒక స్తోత్రం సమర్పించారు. దానిలోని మొదటి చరణం:
“తరంగములు పరంపరవలె వచ్చు సంసార సంకటములను కుదుర్చుటకు గిరిరూప ఔషధమువలె ఉద్భవించిన అరుణశైలవిభూ! నీ పాదములే శరణు. ఆమె అనారోగ్యమును నిర్మూలించుట నీ ధర్మము!”
అళగమ్మ కోలుకొని మానామదురై తిరిగివెళ్ళారు. ఇక 1916లో తిరువణ్ణామలై వచ్చిన ఆమె, రమణుల వద్దనే స్థిరపడాలని నిశ్చయించారు. త్వరలోనే కొడుకు నాగసుందరం కూడా తల్లిబాట పట్టాడు. ఈ సమయంలోనే రమణులు తమ నివాసాన్ని విరూపాక్ష నుంచి స్కందాశ్రమానికి మార్చారు. ఇక్కడే వారు తమ తల్లికి అనునిత్యం వైరాగ్యాన్ని నూరిపోసారు. అక్కడున్న కొద్దిమందికి ఆమె ఆహారం వండిపెట్టేవారు. సన్న్యాసం స్వీకరించిన నాగసుందరం నిరంజనానంద స్వామి అయ్యారు.
1920లో అళగమ్మ తల్లి ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. రమణులకు ఆమెను కంటికి రెప్పలా కాపాడటంలో పలురాత్రులు కంటిమీద కునుకు ఉండేది కాదు. 1922లో భగవాన్ రమణుల హస్తమస్తక సంయోగ దీక్షతో అళగమ్మ విదేహముక్తి నందారు. ఆమెకు స్పృహ వున్నంత వరకు స్వామి వేదాంత బోధ చేసి చివరగా తమ కుడిచేతిని ఆమె హృదయంపైనా, ఎడమచేతిని శిరస్సుపైన వుంచి తదేక దృష్టితో ఆమెను వీక్షిస్తూ మోక్షాన్ని ప్రసాదించారు. ఆచారం ప్రకారం కైవల్యాన్ని పొందిన ఆమె శరీరాన్ని దహనం చెయ్యకుండా, గిరి దక్షిణపాదంలో సమాధి చేసారు. స్కందాశ్రమం నుంచి 20 నిమిషాల దూరంలో ఉన్న ఈ స్థానాన్ని రమణులు తరచు సందర్శించేవారు. ఓ రోజున వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అప్పటినుంచి అంచెలంచెలుగా ఆ సమాధి చుట్టూ రూపుదిద్దుకొన్న నిర్మాణాల సమాహారమే నేటి శ్రీరమణాశ్రమం. “నాకుగా నేనిక్కడకు రాలేదు. అరుణాచలానికి తీసుకొని వచ్చిన శక్తియే నన్నిక్కడకు చేర్చింది” అన్నారు స్వామి.