అరుణాచల స్తుతి:
కొన్ని చిన్న పద్యాలను మినహాయిస్తే అరుణాచల స్తుతి పంచకము అనే అయిదు స్తోత్రాల సంపుటి రమణుల ప్రథమ స్తోత్ర కదంబం – అవి 1914 సం. రచనలు.
‘అరుణాచల అక్షరమణమాల’ ఇందలి తొలిస్తుతి. కొందరు భక్తులు తాము భిక్షా సమయంలో పాడుకోవడానికి ప్రత్యేకమైన ఓ రచనను ప్రసాదించమని ప్రార్థించగా స్వామి రాసినది. రమణుల భక్తబృందం భిక్షాటనకు వెళ్ళినపుడు గృహస్థులు వారిని గుర్తించి సమృద్ధిగా పెట్టి పంపేవారు. ఇది తెలిసి ఇతర బిచ్చగాళ్ళు కూడా వారిలా నటిస్తూ లబ్ధి పొందేవారు. ఈ బెడదనుంచి తప్పించుకోవడానికి వారికో గుర్తింపునిచ్చే పాట అవసరమైంది. భగవాన్ “అరుణాచలశివ …” అనే పల్లవితో మొదలుపెట్టి కొన్ని చరణాలు రాసి ఊరుకున్నారు. భక్తులు ఆర్తితో ఆత్రంగా ఎదురు చూడసాగారు. అంతే, ఓనాడు స్వామి గిరిప్రదక్షిణగా బయలుదేరి మిగిలిన చరణాలు పూర్తిచేసారు. ‘అరుణాచల అక్షరమణమాల’ అనే పేరుపెట్టారు. వధువు జీవుడు, వరుడు అరుణాచలేశ్వరుడు. ఈ స్తోత్రాన్ని పాడినా, విన్నా హృదయం ఉప్పొంగుతుంది, మనసు కరిగిపోతుంది. “అక్షరమణమాల మాకు చాలాకాలం అన్నం పెట్టింది” అంటూ భగవాన్ నవ్వుతూ సెలవిచ్చారు భగవాన్. ‘పదికము’, ‘అష్టకము’ అనే రచనలు తరువాతి క్రమంలో వచ్చాయి. విరూపాక్షగుహలో ఉండగా ఓనాడు ‘కరుణైయాల్’ అనే పదం అదేపనిగా మహర్షి హృదయంలో స్ఫురించసాగింది. దానిని వారు
ఉపేక్షించినా పోకపోయేసరికి, ఆ పదంతో మొదలుపెట్టి ఓ పద్యం రాసారు. అక్కడితో ప్రవాహం ఆగక కొనసాగగా, ‘అరుణాచల పదికము’ ‘అరుణాచల అష్టకము’, రూపొందాయి. పదికం భక్తిపరంగా, అనుగ్రహానికై వేడికోలుగా స్తుతిగా తోచినా, జ్ఞానం అంతర్లీనంగా స్ఫురిస్తుంది. అష్టకం కేవలం తత్త్వప్రధానంగా ఉండి భగవానుల జ్ఞానసిద్ధాంతంతో నిర్భరమై తీరింది.
అష్టకం రాసింది ఎలాగో భగవాన్ వర్ణించారిలా: “మరునాడు నేను గిరిప్రదక్షిణం బయలుదేరాను. కాయితం, పెన్సిల్తో పళనిస్వామి నా వెంటపడ్డాడు. అంతకు ముందురోజు విరూపాక్షగుహకు చేరుకొనేలోపు ఎనిమిదింటిలో ఆరు పూర్తిచేసాను. మరునాడు నారాయణరెడ్డి వచ్చాడు. అప్పటికే కొన్ని గ్రంథాలను ఆయన ముద్రణ చేయించాడు. ఈ పద్యాలను ముద్రిస్తానని పట్టుపట్టాడు. సరే లెమ్మని, వాటిలో మొదటి పదకొండు పద్యాలు ఒక స్తోత్రంగా ముద్రించాలన్నాను. మిగిలిన ఆరు పద్యాల ఛందస్సు వేరు. వాటికి రెండు చేర్చి అష్టకం చేద్దామని యోచించి అప్పటికప్పుడు రెండు రచించి, మొత్తం పంతొమ్మిదీ పట్టుకెళ్ళి ప్రచురించమన్నాను ఈ రెండు స్తుతులు దివ్యస్ఫురణతో వ్రాసినవీ, సాధకులను తత్త్వసాధనలో ఉత్తేజపరిచేవి”.
అరుణాచల అష్టకము:
1. అరయరాని గిరిగ నమరియుం డహహ అతిశయ మీ సేత లరయు వా రెవరు?
అరయరాని చిరువయసుమొద లరుణ గిరి చాల ఘన మని యెరుకలో మెరయ
నరయ లే దది తిరువణ్ణామల యని దెలిసియు నొకరిచే దీనియర్థమును
ఎరుకను మరు గిడి యీడ్వ దాపునకు నరిగిన సమయమం దచలమై గంటి.
2. కనువాడెవం డని మనమున వెదక గనువాడు గన లేక యునికిని గంటి.
కనితిని ననుటకు మనము రాదయ్యె కన నైతి ననుటకు మన మెట్లు వచ్చు?
పలికి దీని దెలుప గల శక్తు లెవరు? పలుకక నే ముందు దెలిపితి వనిన
పలుకక నీ స్థితి దెలుపుట కొరకె మిన్ను మ న్నచలమై మెరయంగ నిలుతు.
3. నిన్ను రూపునిగ నే నెన్ని చూడగ నిలమీద మలగాను నెలకొంటి నీవె.
నీ రూప రూపంచు నెంచుట మిన్ను గన భూమి సంచార మొనరించునటులె.
నీ రూపు నెంచక నెంచిన జలధి యందు చక్కెరబొమ్మ యన రూపుబోవు.
నన్ను నే నెరుగంగ నా రూపు మరెది కల వరుణనగముగా నున్నవాడ.
4. ఉండి వెల్గు నినుగా కొందుట దేవు చీకటిన్ దీపముచే వెదుక టగు.
ఉండి వెలుగు నిన్ను నొంద నున్నావు వివిధ మతములలో వివిధాకృతిగను.
ఉండి వెలుగు నిన్ను నొందక యున్న నా రవి గానని యంధులే వారు.
ఉండి వెలు గొక డై రెండు లే కుల్ల మం దరుణాచల యతులరత్నంబె.
5.మణుల సూత్రం బన మత మనేకముల బ్రతిజీవి లోపల గతు డొక్క డీ వె
మణిరాపిడిగ మనమును మనోశిలను మలము పో రాయ నీ వెలుగందు నపుడు
మణికాంతి యన, లేదు మరియొక వస్తు గ్రహణము, ఛాయాతగడునందు గగన
మణిరశ్మి పడ ఛాయ పడునె, నీకన్న నరుణేశ సత్కాంతి గిరి యొండు కలదె?
6. కల దొండు నెరుకయౌ వెలు గుల్ల మీవె లోన నున్నది యద్భతానన్యశక్తి
యం దణుఛాయాచయము వృత్తి జ్ఞాన మును గూడి, ప్రారబ్ధమును చుట్ల, వృత్తి
జ్యోతిదర్పణమున జూడ నౌ నీడ లోకవిచిత్రము, లోన, నేత్రాది
ద్వారాన వెలిని, నద్దపుముక్క దారి దోచు ఛాయలు పటతుల్య జ్ఞానాద్రి
నిలుప నిలువకున్న నిను వీడి లేవె.
7. అహ మను తలపు లే దన నుండ దన్య,మదివర కేతలం పుదిత మైన నది
యెవరికి? నా కను నేకాహ మెందు నుదయించు నని యెంచి మదిలోన మునిగి
హృత్పీఠ మంద నౌ నేక ఛత్రపతి పరమహం పుణ్యపాప మరణజన్మ
తాప సుఖ జ్ఞాన తమము లనబడు స్వప్నము లేక హృత్సభ నహ మచల
ముగ నటించు నరుణ నగమును నెల్ల లెని స్వయంజ్యోతి జ్ఞానసాగరము.
8. ఉదధి నెగయు మేఘ ముర్వి వర్షించు నీ రది మున్నీరు జేరుపర్యంత
మాపినను నిలువ, దటులనే దేహి నీయందు వెలువడి ని న్జేరుదనుక
కల పలుమార్గాల మెలగి నిలువక, అలసియు వినువీథి నిలుకడ గనక
యిల కాక యితర మేనెలవును లేక వచ్చిన దారి బోవలయు పక్షివలె,
మరలి లోపల వచ్చు మార్గ మేగ, సుఖ అంబుధి నిను బొందు నరుణభూధరుడ.
అరుణాద్రిరమణుని యరవకృతియగు నరుణాచలాష్టక మందు విషయము
తెనుగున దెలుపు నీద్విపదమాలికయు.