ఆధ్యాత్మిక కేంద్రం
ప్రజ్జ్వలించే తన తేజోరూపాన్ని కప్పిపుచ్చి శివుడు అరుణాచల కొండగా ప్రకటమయాడు. “సూర్యునినుంచి కాంతిని అందుకొనే చంద్రునివలె ఇతర క్షేత్రాలు అరుణాచలంనుంచి పావనత్వాన్ని సంతరించుకుంటాయి” అని ప్రకటించాడు. నన్ను ఆరాధించి వికసించాలనుకొనే వారికోసం ఇక్కడొక్క చోటే నేనీ రూపధారణ చేసాను. అరుణాచలం ఓంకారమే. శాంతిప్రదాయక జ్యోతిగా ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఈ కొండపై వెలుగొంది దర్శనమిస్తాను”. ఈ ప్రకటన అరుణాచల పావిత్య్ర ప్రాశస్త్యాన్ని వెల్లడి చేయడం మాత్రమే కాక అద్వైత తత్త్వ ప్రాధాన్యతను, అరుణాచలం యొక్క ఆత్మవిచార కేంద్ర కీలకాన్ని సుస్పష్టం చేస్తుంది. “చివరకి అంతా, అన్నీ అరుణాచలం చేరుకోవాల్సిందే” అన్న రమణవాణిలోని ఆంతర్యమిదే.